క్రికెట్ నుంచి సినిమాలోకి..కోలీవుడ్‌లో కొత్త ప్రస్థానం

క్రికెట్ నుంచి సినిమాలోకి..కోలీవుడ్‌లో కొత్త ప్రస్థానం

టీమిండియా (Team India) మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) సినీ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. సినిమా నటుడిగా కోలీవుడ్‌ (Kollywood)లో తన కొత్త ఇన్నింగ్స్ (New Innings) ప్రారంభించనున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు తమిళ సినిమా నిర్మాణ సంస్థ డ్రీమ్ నైట్ స్టోరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Tamil Movie Production Company Dream Night) శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. క్రికెటర్ శివం దూబే చేతుల మీదుగా రైనాకు స్వాగతం పలుకుతున్న వీడియోను విడుదల చేశారు.

క్రికెట్ మైదానం నుంచి.. కోలీవుడ్ ఫ్రేమ్స్ దాకా..

ఈ సందర్భంగా సురేశ్ రైనా ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, “క్రికెట్ మైదానం నుంచి.. కోలీవుడ్ ఫ్రేమ్స్ దాకా.. చెన్నై నాలో నిండి నన్ను ముందుకు నడిపిస్తోంది. నా ఈ కొత్త ప్రయాణంలో డీకేఎస్ సంస్థ (DKS Company)తో జట్టుకట్టడం ఎంతో గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేశ్ రైనా 2005 నుంచి 2018 వరకు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు.

అంతర్జాతీయ స్థాయిలో 226 వన్డేలు, 78 టీ20లు, 18 టెస్టులు ఆడిన రైనా, ఆయా ఫార్మాట్లలో వరుసగా 5615, 1604, 768 పరుగులు సాధించారు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు ఐపీఎల్‌లో ఘనమైన రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తంగా 205 మ్యాచ్‌లు ఆడిన రైనా 5528 పరుగులు సాధించి ‘మిస్టర్ ఐపీఎల్’గా గుర్తింపు పొందారు.

‘చిన్న తల’గా అభిమానుల హృదయాల్లో చోటు

ఐపీఎల్ కెరీర్‌లో చాలా ఏళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సురేశ్ రైనా ‘చిన్న తల’గా అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత అంతటి స్థాయిలో చెన్నై అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు అక్కడి నుంచే తన సినీ ప్రయాణం కూడా మొదలుపెట్టనున్నారు.

తమిళ సినిమా ద్వారా అరంగేట్రంపై సంతోషం

తాను తమిళ సినిమా ద్వారా అరంగేట్రం చేయడం గురించి సురేశ్ రైనా మాట్లాడుతూ, “దర్శకుడు నా దగ్గరకు వచ్చి కథ చెప్పినపుడు అది నా మనసుకు ఎంతో దగ్గరగా అనిపించింది. క్రికెట్‌కు సంబంధించిన ఈ సినిమాలో నటించడం గర్వకారణం. అది కూడా ఎన్నో ఏళ్లుగా సీఎస్‌కేకు ఆడి.. తమిళనాడు నుంచి నా సినిమా ప్రయాణం మొదలుపెట్టడం మరింత సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను కురిపించారు” అని పేర్కొన్నారు. సురేశ్ రైనా నటిస్తున్న తమిళ చిత్రానికి లోగాన్ దర్శకుడు కాగా, సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, టీమిండియా మరో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా గతంలో కోలీవుడ్ సినిమాలో నటించారు. అదే విధంగా, కేరళకు చెందిన మాజీ పేసర్ శ్రీశాంత్ కూడా తమిళ సినీ రంగంలో నటుడిగా అడుగుపెట్టారు. నయనతార, సమంతలతో కలిసి విజయ్ సేతుపతి నటించిన ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో శ్రీశాంత్ ‘మోబీ’ అనే పాత్రలో నటించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment