మీకిదే చివరి అవకాశం.. తెలంగాణ స్పీకర్‍కు సుప్రీం హెచ్చరిక

తెలంగాణ (Telangana)లో పెండింగ్‌లో ఉన్న పార్టీ ఫిరాయింపు (Party Defection) ఎమ్మెల్యేల(MLAs) వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుల్లో స్పీకర్ (Speaker) ఇప్పటికైనా తుది నిర్ణయం తీసుకుంటారా? లేక సుప్రీంకోర్టే స్వయంగా జోక్యం చేసుకుంటుందా? అన్న ప్రశ్నలను న్యాయస్థానం బహిరంగంగానే లేవనెత్తింది. “ఇదే మీకు చివరి అవకాశం” అంటూ స్పీకర్‌కు సుప్రీంకోర్టు (Supreme Court) గట్టి హెచ్చరిక జారీ చేసింది.

రెండు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోకపోతే, తామే తగిన ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ రెండు వారాల వ్యవధిలో స్పీకర్ తీసుకున్న చర్యలపై అఫిడవిట్ సమర్పించాలని కూడా ఆదేశించింది. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

బీఆర్ఎస్‌(BRS)కు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్ (Justice Sanjay Karol), జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ (Justice Augustine George)లతో కూడిన ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. విచారణ సందర్భంగా ఇప్పటివరకు స్పీకర్ ఏడుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై తీసుకున్న చర్యలను సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో మిగిలిన ఎమ్మెల్యేలపై కూడా రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. అయితే దీనికి అభిషేక్ సింఘ్వీ గడువు కోరుతూ, మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు నాలుగు వారాల సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కోర్టు, ఇప్పటికే స్పీకర్‌కు చాలాసేపు ఇచ్చామని, ఇకపై ఎలాంటి ఆలస్యం సహించబోమని స్పష్టంగా చెప్పింది. ఇదే చివరి అవకాశం అంటూ తేల్చి చెప్పింది.

సకాలంలో నిర్ణయం తీసుకోకపోతే కీలక పరిణామాలు తప్పవని హెచ్చరిస్తూ, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ప్రస్తుతం మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు నమోదుకాగా, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యదయ్యలకు స్పీకర్ ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చారు.

మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ముఖ్యంగా దానం నాగేందర్‌పై స్పీకర్ వేటు తప్పదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment