పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మరియు రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో రైతులు (Farmers) పంట వ్యర్ధాలను (Crop Wastes) తగలబెడుతూ ఉంటారు.ఈ ప్రకియ ద్వారా భారీగా వాయు కాలుష్యం జరుగుతుంది. దీనికి కారణమవుతున్న రైతులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు (Supreme Court) పంజాబ్ ప్రభుత్వాన్ని (Punjab Government) నిలదీసింది. కొందరు రైతులను (Farmers) జైలుకు(Jail) పంపితేనే మిగతా రైతులకు సరైన సందేశం వెళ్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని సుమోటోగా విచారించింది. “రైతులు నిజంగా ప్రత్యేకమైనవాళ్లే, వారే మనకు ఆహారం అందిస్తున్నారు. కానీ దాని అర్థం పర్యావరణాన్ని కాపాడకుండా మౌనంగా ఉండమని కాదు” అని ధర్మాసనం పేర్కొంది. కాలుష్యానికి పాల్పడుతున్న వారిని శిక్షించడానికి చట్టంలో నిబంధనలు ఉన్నాయని, పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పం ఉంటే రైతులను అరెస్ట్ చేయడానికి ఎందుకు వెనుకాడాలని కోర్టు ప్రశ్నించింది.
పంజాబ్ ప్రభుత్వం వాదనలు
పంజాబ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా వాదనలు వినిపిస్తూ, గత ఏడాదితో పోలిస్తే పంట వ్యర్థాల దహనం గణనీయంగా తగ్గిందని తెలిపారు. అయితే, కోర్టు సహాయకురాలు (అమికస్ క్యూరీ) అపరంజిత ఈ వాదనలను తోసిపుచ్చారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ రైతులు తమ పద్ధతి మార్చుకోవడం లేదని, అధికారులు ఉపగ్రహాలు వెళ్లేటప్పుడు మాత్రమే కాల్చవద్దని చెబుతున్నారని రైతులు తమతో చెప్పినట్లు ఆమె కోర్టుకు వివరించారు.
న్యాయమూర్తులు పంజాబ్ ప్రభుత్వానికి ఒక కఠినమైన హెచ్చరిక చేశారు. “పర్యావరణానికి నష్టం కలిగించే రైతులపై చర్యలు తీసుకోవాలి. లేదంటే, ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా మాకు తెలపండి, మేమే తుది నిర్ణయం తీసుకుంటాం” అని కోర్టు ఆగ్రహం వ్యక్తపరిచింది.
ఈ సమస్యను పరిష్కరించడానికి, రైతులకు కేవలం సూచనలు ఇవ్వడం కాకుండా, అరెస్టులు, జైలుకు పంపడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని గట్టి సందేశం ఇవ్వాలని కోర్టు సూచించింది. వచ్చే పంట కాలం లోపు పొలాల్లో వ్యర్థాలను పర్యావరణానికి హాని కలగని విధంగా తొలగించాలని కూడా రాష్ట్రాలకు ఆదేశించింది.







