వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు కీలక మధ్యంతర తీర్పు వెలువరించింది. చట్టంలోని కొన్ని నిబంధనలపై తాత్కాలిక స్టే విధించింది. ముఖ్యంగా ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలనే నిబంధనను నిలిపివేయడంతో పాటు మరికొన్ని కీలక సెక్షన్ల అమలు నిలిచిపోయింది. అయితే మొత్తం చట్టాన్ని నిలిపివేయాలని చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ వ్యాఖ్యానిస్తూ, వక్ఫ్ ఆస్తులా? కాదా? అన్న నిర్ణయం పూర్తిగా కోర్టులదేనని స్పష్టం చేశారు. అలాగే వివాదాస్పద ఆస్తుల విషయంలో ఎటువంటి థర్డ్ పార్టీ జోక్యం అనుమతించరాదని పేర్కొన్నారు. ఈ తీర్పుతో వక్ఫ్ ఆస్తులపై తలెత్తే వివాదాలకు కొత్త మార్గదర్శకాలు ఏర్పడ్డాయి.
బోర్డు సభ్యత్వంపై సైతం సర్వోన్నత న్యాయస్థానం మార్గనిర్దేశం చేసింది. వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలనే నియమించాలని, బోర్డులో నలుగురికిపైగా ముస్లిమేతరులు ఉండకూడదని స్పష్టం చేసింది. రాష్ట్ర స్థాయిలో అయితే ముగ్గురికి మించి ముస్లిమేతరులు ఉండరాదని స్పష్టంచేసింది. దీంతో వక్ఫ్ సవరణ చట్టంలోని కొంత భాగం అమల్లో ఉండగా, కొన్ని నిబంధనలు అమలులోనుంచి తప్పించబడ్డాయి.