తమ ఇళ్లను కూల్చారంటే గతంలో హల్‌చల్ చేసిన ఇప్పటం గ్రామస్థులకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన 14 మంది తమ ఇళ్లను గత వైసీపీ ప్రభుత్వం కూల్చిందని సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు వారి స్పెషల్ లీవ్ పిటీషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు, పిటీషనర్లు కోర్టు ఖర్చుల కింద ఒక్కొక్కరు రూ.25,000 చొప్పున చెల్లించాలని ఆదేశించింది.
వివాదానికి మూలం ఏమిటి?
2022లో అప్పటి ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో ఇప్పటం గ్రామంలో కొన్ని ప్రహరీలు తొలగించింది. కానీ, పిటిషనర్లు తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రాత్రికిరాత్రే ఇళ్లు కూల్చేశారంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో రాజకీయ రంగు పూసుకుంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామాన్ని సందర్శించి వైసీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు వారించినా వినకుండా నడుచుకుంటూ వెళ్లి బాధితులను పరామర్శించి, ప్రతి కుటుంబానికి రూ.1 లక్ష సాయం ప్రకటించారు.
కాగా, ఇదే విషయంపై ఇప్పటం గ్రామానికి చెందిన 14 మంది గతంలో హైకోర్టును సైతం ఆశ్రయించగా, కోర్టు వీరి పిటీషన్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక్కొక్కరు రూ.1 లక్ష చొప్పున కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని సూచించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేయగా, హైకోర్టు తీర్పును దేశ అత్యున్నత ధర్మాసనం సమర్థించింది. పిటీషనర్ల కోరిక మేరకు కోర్టు ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరు రూ.25 వేల చొప్పున చెల్లించాలని తీర్పునిచ్చింది.