ఇటీవల దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల (Street Dogs) కారణంగా ప్రజలకు ప్రాణాపాయం ఏర్పడితే, దానికి కుక్కలకు ఆహారం పెట్టేవాళ్లు, అలాగే బాధ్యత వహించాల్సిన అధికారులు బాధ్యులేనని స్పష్టం చేసింది. కుక్క కాటుతో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలపై భారీ పరిహారం విధిస్తామని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
వీధి కుక్కల సమస్యపై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల కోసం ఆరాటపడే వారు నిజంగా జంతు ప్రేమికులైతే, వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని సూచించింది. రోడ్లపై వదిలి పెట్టడం వల్ల చిన్నారులు, వృద్ధులు సహా అనేక మంది కుక్క కాటుకు గురవుతున్నారని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
వీధుల్లో తిరుగుతున్న కుక్కలు మనుషుల్ని కరుస్తూ, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని పేర్కొంది. తొమ్మిదేళ్ల చిన్నారిపై కుక్క దాడి జరిగిన ఘటనను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఇలాంటి సందర్భాల్లో బాధ్యత ఎవరిది అనే ప్రశ్నను లేవనెత్తింది. కుక్క కాటుతో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వాలే భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. వీధి కుక్కల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వాలపై న్యాయపరమైన బాధ్యత తప్పదని హెచ్చరించింది. ప్రజల భద్రతకు ముప్పుగా మారుతున్న వీధి కుక్కల సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన విధానాలతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.








