ముంబై (Mumbai): తాను తీసుకునే సంచలన నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి సన్నీ లియోన్ (Sunny Leone). అడల్ట్ సినిమాలు తీసినా, అనాథ పిల్లలను దత్తత తీసుకున్న ఆమె మనసు మాత్రం ఎలాంటి మలినం లేనిదని చెప్పాలి. ఈసారి తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించారు. తాను ముగ్గురు పిల్లలకు తల్లి అయినప్పటికీ, వారెవరికీ జన్మనివ్వలేదని, ఒకరు దత్తత ద్వారా, మరో ఇద్దరు సరోగసీ (Surrogacy) ద్వారా తమ జీవితంలోకి వచ్చారని ఆమె వెల్లడించారు. ఇటీవల ఒక టీవీ షోలో తన దత్తత, సరోగసీ ప్రయాణం గురించి ఆమె చేసిన నిజాయితీ పూరితమైన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
దత్తత నుండి సరోగసీ వరకు
సన్నీ లియోన్ మాట్లాడుతూ, “నేను ఎప్పుడూ ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని కోరుకున్నాను. దత్తత కోసం అప్లై చేసిన రోజునే ఒక పాపతో మాకు మ్యాచ్ అయింది, అలా మా ప్రయాణం మొదలైంది” అని తెలిపారు. అయితే, ఆమె గర్భధారణకు ఇష్టపడలేదని, అందుకే సరోగసీని ఎంచుకున్నామని వివరించారు. ఈ నిర్ణయం కేవలం ఒక వైద్యపరమైన ప్రక్రియ కాదని, అది ఒక ప్రేమతో కూడిన, భావోద్వేగపూరితమైన నిర్ణయమని ఆమె అభిప్రాయపడ్డారు.
‘సరోగసీ కోసం భారీగా ఖర్చు చేశాం’
సరోగసీ ప్రక్రియలో తాను ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లను కూడా సన్నీ పంచుకున్నారు. “సరోగసీ చాలా ఖర్చుతో కూడుకున్నది. మేము సరోగసీ మదర్‌కు ప్రతి వారం డబ్బులు చెల్లించేవాళ్ళం. అంతేకాదు, ఆమె భర్త కూడా డ్యూటీకి వెళ్లకుండా ఉండటానికి మేము ఆర్థికంగా సహాయం చేశాము. మేము ఇచ్చిన డబ్బుతో ఆమె ఒక ఇల్లు కూడా కొనుక్కుంది” అని సన్నీ తెలిపారు. ఈ వ్యాఖ్యలు సరోగసీ ప్రక్రియలో ఉండే ఆర్థిక, మానసిక అంశాలను కళ్లకు కట్టాయి.
సరోగసీ అనేది కేవలం ఒక ఒప్పందం కాదని, ఒకరి జీవితానికి మరో ప్రాణం ఇవ్వడానికి ప్రేమతో కూడిన నిర్ణయమని సన్నీ చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.








