వారం రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కొన్ని అనివార్య పరిస్థితుల్లో 9 నెలలు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇటీవలే వారు భూమి మీదకు తిరిగి వచ్చారు. అయితే, వారి అదనపు సేవలకు ఏమైనా ప్రత్యేకంగా జీతం ఉంటుందా? అనే ప్రశ్నపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. “వారి ఓవర్‌టైమ్ జీతాన్ని నా జేబు నుంచి నేనే చెల్లిస్తా” అని ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు, వారిని భూమికి సురక్షితంగా తీసుకురావడానికి సహకరించిన ఎలాన్ మస్క్‌కు (Elon Musk) ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
నాసా వ్యోమగాములకు అదనపు వేతనం ఉందా?
సాధారణంగా నాసా (NASA) వ్యోమగాములు ఫెడరల్ ఉద్యోగులుగా పరిగణించబడతారు. వారు అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపినా, అదనపు జీతం చెల్లింపు ఉండదు. నాసా నిపుణుల ప్రకారం, నాసా వారి ఆహారం, బస ఖర్చులను భరిస్తుంది. అదనంగా రోజుకు కేవలం 5 డాలర్ల చొప్పున చెల్లింపులు జరుగుతాయి. అంటే, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 286 రోజులు అంతరిక్షంలో గడిపినందుకు $1,430 (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.1,22,980) మాత్రమే అదనంగా అందుకోనున్నారు.
కాగా, నాసా ఉద్యోగులకు జీఎస్-13 నుంచి జీఎస్-15 గ్రేడ్ మేరకు జీతాలు ఉంటాయి. సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్‌లు జీఎస్-15 కేటగిరీలో ఉన్న కారణంగా, వార్షిక వేతనం సుమారు $123,152 (రూ.1,05,91,115)గా ఉంటుంది.