మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన సునేత్ర పవార్ నేడు మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మహారాష్ట్ర చరిత్రలో తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ రికార్డు సృష్టించనున్నారు.
విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందిన నేపథ్యంలో, డిప్యూటీ సీఎం బాధ్యతలను ఆయన సతీమణి సునేత్ర పవార్‌కు అప్పగించాలని ఎన్సీపీ అజిత్ వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనను సునేత్ర పవార్ అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం ఎన్సీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుండగా, ఆ సమావేశంలోనే సునేత్ర పవార్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది.
అనంతరం సాయంత్రం ముంబైలోని లోక్‌భవన్‌లో సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆమెకు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎక్సైజ్, క్రీడా శాఖలను కొనసాగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దే ఆర్థిక శాఖ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బారామతి ఉపఎన్నికల్లో సునేత్ర పవార్ పోటీ చేయనున్నట్లు కూడా ఎన్సీపీ అజిత్ వర్గం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నాకు సమాచారం లేదు.. శరద్ పవార్
ఇదిలా ఉండగా, ఈ పరిణామాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని శరద్ పవార్ తెలిపారు. డిప్యూటీ సీఎం పదవి స్వీకరిస్తున్న విషయాన్ని సునేత్ర పవార్ కూడా తనకు చెప్పలేదని వెల్లడించారు.








