మహేశ్‌బాబు #GlobeTrotter మెగా ఈవెంట్ నేడే!

మహేశ్‌బాబు #GlobeTrotter మెగా ఈవెంట్ నేడే!

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక యాక్షన్–అడ్వెంచర్ మూవీ #GlobeTrotter మెగా ఈవెంట్ నేడు సాయంత్రం 5 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ కార్యక్రమంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా, రాజమౌళి స్వయంగా సోషల్ మీడియాలో దీని వివరాలను వెల్లడించారు. ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన అధికారిక టైటిల్‌ను ప్రకటించనున్నారు.

అంతేకాకుండా, గ్లోబల్ అడ్వెంచర్‌ను పరిచయం చేసే అద్భుతమైన విజువల్స్‌ను 100 అడుగుల భారీ స్క్రీన్‌పై ప్రదర్శించిన తర్వాతే ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభ), కీలక పాత్రలో ప్రియాంకా చోప్రా (మందాకిని)లను పరిచయం చేయగా, నేటి ఈవెంట్‌లో మహేశ్‌బాబు పాత్ర పేరు, గెటప్ వంటి కీలక అంశాలను వెల్లడించనున్నారు.

ఈ ఈవెంట్ ఏర్పాట్లు వినూత్నంగా ఉన్నాయి. పాస్‌పోర్ట్‌ను పోలిన ప్రత్యేకమైన ఈవెంట్ పాస్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో అభిమానుల రాకపోకల దిశలు, పాటించాల్సిన సూచనలు వంటి వివరాలు ఉంచారు. ఇటీవల విడుదలైన ‘సంచారీ’ పాట ట్రెండ్ అవుతుండగా, నేటి ఈవెంట్‌ను ఇండియాలోని అభిమానులు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం సజావుగా సాగేందుకు అభిమానులు సహకరించాలని రాజమౌళి, మహేశ్‌బాబు ప్రత్యేక వీడియోల ద్వారా విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment