సృష్టి టెస్ట్ ట్యూబ్ (Srishti Test Tube) కేసు(Case) తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశంలో సంచలనంగా మారింది. ఈ కేసులో విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. IVF (ఇన్ విట్రో ఫర్టిలైజేషన్) కోసం వచ్చిన దంపతులను సరోగసీ (Surrogacy) (అద్దె గర్భం) వైపు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. IVF అయితే రెండు, మూడు లక్షలు మాత్రమే వస్తాయని భావించిన సృష్టి ఫౌండర్ డాక్టర్ నమ్రత, సరోగసీ ద్వారా దంపతుల ఆర్థిక స్థోమతను బట్టి భారీగా వసూలు చేయవచ్చని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు వసూళ్లు
పోలీసుల దర్యాప్తులో నమ్రత సరోగసీ కోసం ఒక్కో జంట నుంచి రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు వసూలు చేసినట్లు బయటపడింది. ఇప్పటికే 30 మందికి పైగా సరోగసీ కోసం డబ్బులు చెల్లించినట్లు గుర్తించారు. సరోగసీ బాధితుల జాబితా కూడా పోలీసులకు లభించినట్లు సమాచారం. IVF కోసం హైదరాబాద్ కేంద్రాన్ని సంప్రదించిన వారిని విశాఖపట్నానికి పంపించి, అక్కడ డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆపై విశాఖపట్నం వచ్చిన దంపతులను విజయవాడ, హైదరాబాద్ పంపించి కూడా వసూళ్లకు పాల్పడ్డారు. దంపతులకు అనుమానం రాకుండా, సరోగసీ మదర్‌తో నేరుగా సంప్రదించే అవకాశం లేకుండా నమ్రత జాగ్రత్త పడినట్లు విచారణలో తేలింది.
ఇన్నాళ్లూ ఏం చేశారు..?
సృష్టి ఫెర్టిలిటీ కేసుతో ఆరోగ్యశాఖ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రెండేళ్ల నుంచి అనుమతులు లేకుండా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను విశాఖ లో నడుపుతున్న ఆ శాఖ అధికారులు పట్టించుకోలేదు. పక్క రాష్ట్రంలో కేసు నమోదు కావడంతో సమావేశాల పేరిట హడావుడి చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. విశాఖలో అధికారికంగా 50 ఐ.వీ.ఎఫ్ సెంటర్లు ఉన్నట్టు గుర్తించిన అధికారులు, వాటిపై అత్యవసర సమావేశం నిర్వహించారు. సృష్టి ఫెర్టిలిటీ లాంటి ఘటనలు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలంటూ హడావిడిగా వారిని పిలిచి వార్నింగ్‌లు ఇచ్చారు. ఇన్నాళ్లూ లైసెన్స్ లేకుండా నడిపిన సృష్టి ఫెర్టిలిటీని ఎలా వదిలేశారని, ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.








