తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై సీబీఐ నేతృత్వంలోని సిట్ నివేదిక వెలువడిన తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మళ్లీ విచారణకు సిద్ధమవుతోంది. తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని సుప్రీం కోర్టు పర్యవేక్షణలోని సీబీసీ సిట్ స్పష్టంగా తేల్చినా, ఈ వ్యవహారంలో “సూత్రధారులను శిక్షించాలి” అనే పేరుతో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కు మరో విచారణ అప్పగించాలని నిర్ణయించింది.
లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు గతంలో చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా, దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ హోదాలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు, సీబీఐ నేతృత్వంలో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సుమారు 14 నెలల పాటు సీబీఐ సిట్ విచారణ జరిపి తాజాగా చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ నివేదికలో లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు, ఈ వ్యవహారంలో వైసీపీ నేతల ప్రమేయం లేదని కూడా తేల్చింది. దీంతో లడ్డూ కల్తీపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఆరోపణలు మాత్రమేనని స్పష్టమైంది. శ్రీవారి భక్తులు కూడా ఇటీవల కూటమి పెద్దలను నిలదీస్తూ సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే.
సీబీఐ సిట్ నివేదికతో కోట్లాది మంది శ్రీవారి భక్తులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, కూటమి ప్రభుత్వం మాత్రం ఆ నివేదికపై అసంతృప్తిగా ఉన్నట్టు తాజా కేబినెట్ నిర్ణయం ద్వారా స్పష్టమైంది. సిట్ నివేదికతో తమ ఆరోపణలు తప్పని తేలడంతో పాలకులకు పరువు పోయిందన్న భావన ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. అందుకే ఏదో ఒక రూపంలో ఆరోపణలను నిజం చేయాలనే ప్రయత్నంలో మరో విచారణకు శ్రీకారం చుట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగిన సీబీఐ విచారణను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కొత్త విచారణ చేపట్టడం న్యాయపరంగా ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారం రోజురోజుకూ తిరుమల లడ్డూ ప్రసాదాన్ని మరింత వివాదాస్పదంగా మార్చుతుండటంతో భక్తుల్లో ఆందోళన పెరుగుతోంది. కోర్టు పర్యవేక్షణలో వచ్చిన నివేదికను కాదని మరో విచారణకు అనుమతి ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.







