శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయం(Srisailam Temple)లో నకిలీ దర్శనం టికెట్ల(Fake Darshan Tickets) వ్యవహారం కలకలం రేపుతోంది. అధిక రేట్లకు పాత టికెట్లను ఎడిట్ చేసి భక్తులకు విక్రయిస్తూ, వారిని మోసం చేసిన సంఘటనపై దేవస్థానం సీఈవో మధుసూదన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భక్తుల ఫిర్యాదుతో నిజం వెలుగులోకి..
ఫిబ్రవరి 14న మల్లన్న స్వామి దర్శనానికి వచ్చిన కొంతమంది భక్తులు, ఇద్దరు కేటుగాళ్ల నుంచి వేల రూపాయలు చెల్లించి దర్శనం టికెట్లు కొనుగోలు చేశారు. కానీ, క్యూలైన్లో వారి వంతు వచ్చేసరికి, స్కానింగ్ సెంటర్ వద్ద టికెట్లు చెల్లుబాటు కాలేదు. ఆలయ సిబ్బంది టికెట్లను పరిశీలించగా అవి నకిలీ అని తేల్చారు.
ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం సీఈవో పోలీసులకు కంప్లైంట్ చేయగా, శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.








