శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన గిరిజన బాలిక (17) హత్యాచారం కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. చదువు చెప్పిస్తానని నమ్మించి తీసుకెళ్లి, కాలయముడిలా మారి బాలిక ప్రాణాలు తీసిన నిందితుడు వెంకటరమణ (సివిల్ ఇంజనీర్) అరెస్ట్ విషయంలో పోలీసులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయ పలుకుబడి.. పోస్టుమార్టం రిపోర్ట్ మార్పు?
నిందితుడికి భారీగా ధనం, రాజకీయ పలుకుబడి ఉండటంతో కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నిందితుడి కుమార్తె శ్రీకాకుళం రిమ్స్ (GGH)లో వైద్యురాలు కావడంతో, ఆమె తన ప్రభావాన్ని ఉపయోగించి పోస్టుమార్టం నివేదికను మార్పించేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.
తల్లిదండ్రుల ఆవేదన
“మా కూతురిని బాగా చదివించాలనుకున్నాం.. కానీ నమ్మిన వాడే నట్టేట ముంచాడు. మా బిడ్డకు జరిగిన అన్యాయంపై పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు?” అంటూ బాధితురాలి తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలి లేదా ఎన్కౌంటర్ చేయాలి. తమకు న్యాయం జరగకపోతే, తమ కళ్ళ ముందే కూతురిని పోగొట్టుకున్న తాము కూడా ఆత్మహత్య చేసుకుంటామని ఆ దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది?
హిరమండలం మండలానికి చెందిన ఈ బాలికకు ఇంగ్లీష్ నేర్పిస్తానని నమ్మించిన వెంకటరమణ, ఈ నెల 22న ఆమెను తనతో తీసుకెళ్లాడు. ఆ తర్వాత విశాఖలోని నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి, తీవ్రంగా గాయపరిచాడు. బాలిక పరిస్థితి విషమించడంతో ‘చనిపోయింది’ అని నమ్మించి తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నం చేశాడు. చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. ప్రస్తుతం ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసులు నిందితుడిని ఎప్పుడు రిమాండ్కు తరలిస్తారో, బాధితురాలికి న్యాయం ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాలి.








