విజయవాడ సమీపంలోని గోసాల శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థి గౌతమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫీజు బాకీ ఉన్న కారణంగా కళాశాల యాజమాన్యం అర్ధరాత్రి అతడిని బయటకు పంపించేసింది. దీంతో విద్యార్థి, అతని తండ్రి కళాశాల గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
వివరాలు ఇలా…
హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు ఆబోతు టార్జాన్ కుమారుడు గౌతమ్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల అనంతరం ఆదివారం రాత్రి తండ్రితో కలిసి కళాశాలకు వచ్చిన గౌతమ్‌ను ఫీజు కట్టకపోతే హాస్టల్‌లోకి అనుమతించబోమని కళాశాల సిబ్బంది తేల్చిచెప్పారు. టార్జాన్ తన వద్ద ఉన్న రూ. 20 వేలు చెల్లించినప్పటికీ, మిగిలిన రూ. 50 వేలు కొంత సమయం ఇవ్వాలని కోరగా, యాజమాన్యం నిరాకరించింది.
ఈ పరిణామంతో విద్యార్థి, అతని తండ్రి కళాశాల గేటు వద్దే నిరసనకు దిగారు. విషయం మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో, పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పరిస్థితిని సర్దుబాటు చేయడానికి వచ్చిన పోలీసులు కళాశాల యాజమాన్యంతో చర్చలు జరిపిన తర్వాత గౌతమ్‌ను తిరిగి హాస్టల్‌లోకి అనుమతించారు.
“ఏప్రిల్‌లో పరీక్షలు ఉన్నాయి, ఆ లోపు మిగతా ఫీజు కడతానని చెప్పినా కాలేజీ మాకు కనీస గడువు ఇవ్వలేదు. అర్ధరాత్రి వేళ పిల్లాడిని బయటకు పంపించడం ఎంతవరకు న్యాయం?” అని టార్జాన్ వాపోయారు. ఈ సంఘటన విద్యార్థి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థుల సంఘాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి.








