పార్టీ ఫిరాయింపుల ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో శనివారం నాడు విచారణ కొనసాగుతోంది.
బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లలో భాగంగా, ఈ రోజు గూడెం మహిపాల్ రెడ్డి మరియు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు సంబంధించిన విచారణ జరుగుతోంది. గతంలో వీరి విచారణ వాయిదా పడింది. శనివారం ఉదయం, ఫిర్యాదుదారు చింతా ప్రభాకర్ అడ్వొకేట్లు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అడ్వొకేట్లను క్రాస్ ఎగ్జామ్ చేశారు. అనంతరం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తరపు న్యాయవాదులను బీఆర్ఎస్ న్యాయవాదులు క్రాస్ ఎగ్జామ్ చేయనున్నారు.
బుధవారం నాటి విచారణలో టి. ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్యల వాదనలు, క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యాయి. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ పూర్తయిన తర్వాత, స్పీకర్ దానం నాగేందర్, కడియం శ్రీహరిలతో సహా మిగతా ఎమ్మెల్యేల విచారణ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. నోటీసులకు స్పందించని ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








