ఆగ్నేయాసియా దేశాలైన ఇండోనేషియా (Indonesia), థాయ్‌లాండ్ (Thailand), మలేషియా (Malaysia), శ్రీలంకల (Sri Lanka)లో అసాధారణమైన సెన్యార్ (Senyar), దిత్వా (Ditwa) తుఫానులు పెను విధ్వంసం సృష్టించాయి. ముఖ్యంగా ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపాన్ని (Sumatra Island) భారీ జలఖడ్గం విరుచుకుపడింది. కుండపోత వర్షాల కారణంగా సుమత్రాలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 442 మంది చనిపోయారు.
ఇండోనేషియాలో వేలాది భవనాలు మునిగిపోగా, అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇక శ్రీలంకలో దిత్వా తుఫాన్ (Ditwa Cyclone) కారణంగా 193 మందికి పైగా, థాయ్‌లాండ్‌లో 145 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ జలప్రళయం కారణంగా ఆగ్నేయాసియాలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది మంది గల్లంతయ్యారు.
భారీ ఈదురుగాలులు మరియు కుండపోత వర్షాల వల్ల ఆగ్నేయాసియా అంతటా మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుఫాను తాకిడికి ప్రధాన రహదారులన్నీ ధ్వంసమయ్యాయి. ఫలితంగా విద్యుత్, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం వందలాది మంది తప్పిపోయినట్లుగా కథనాలు వస్తున్నాయి. పరిస్థితి విషమించడంతో విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తూ, వరదల్లో చిక్కుకున్న వారికి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ తుఫానుల వల్ల ఆగ్నేయాసియా దేశాలు అతలాకుతలమై, మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.








