స్కిల్ స్కామ్‌ కేసు.. ఏసీబీ కోర్టులో మ‌రో పిటీష‌న్

స్కిల్ స్కామ్‌ కేసు.. ఏసీబీ కోర్టులో మ‌రో పిటీష‌న్

స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill Development Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister N. Chandrababu Naidu)తో పాటు మొత్తం 37 మంది నిందితులపై కేసును ముగించిన నేపథ్యంలో, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏసీబీ కోర్టు (ACB Court)లో పిటిషన్ దాఖలైంది. రైల్వే మాజీ ఉద్యోగి వేము కొండలరావు (Vemu Kondalarao) ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

సీఐడీ పోలీసులు దాఖలు చేసిన ఫైనల్ రిపోర్టు, అలాగే కేసును ముగిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులను తనకు అందజేయాలంటూ పిటిషనర్ కోర్టును కోరారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరుతో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు కాగా, అప్పట్లో చంద్రబాబు నాయుడు 54 రోజుల పాటు రాజ‌మండ్రి జైల్‌లో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

ఈ కేసులో ఫిర్యాదుదారుడు సీఆర్‌పీసీ 164 సెక్షన్ కింద స్టేట్‌మెంట్ ఇచ్చినప్పటికీ, అలాంటి పరిస్థితుల్లో కేసును ఏ విధంగా క్లోజ్ చేశారన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని పిటిషనర్ డిమాండ్ చేస్తున్నారు. కేసు ముగింపుపై సీఐడీ, కోర్టు తీసుకున్న నిర్ణయాలపై సందేహాలు ఉన్నాయని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై జనవరి 19న విచారణ చేపట్టనున్నట్లు ఏసీబీ న్యాయస్థానం తెలిపింది. పిటిషనర్ తరపున మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు. అవసరమైతే ఏసీబీ కోర్టు నుంచి న్యాయం లభించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇప్పటికే రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చంద్ర‌బాబు త‌న అధికారాన్ని అడ్డం పెట్టుకొని త‌న‌పై న‌మోదైన కేసుల‌న్నీ ఒక్కొక్క‌టిగా క్లోజ్ చేయించుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ తాజా పిటిషన్‌తో ఈ వ్యవహారం మరోసారి న్యాయపరమైన దిశలో కీలక మలుపు తిరిగినట్టుగా భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment