అమరన్ సినిమా సక్సెస్‌తో మంచి జోష్ మీదున్న కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం టైమ్ ట్రావెలింగ్ (Time Traveling) కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శివకార్తికేయన్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్స్ (Two Heroines) నటించనున్నట్లు తెలిసింది. వారిలో ఒకరు కాయదు లోహర్ (Kayadu Lohar) కాగా, మరొకరు కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) అని సమాచారం.
గతంలో కల్యాణి ప్రియదర్శన్ శివకార్తికేయన్‌కు జోడీగా ‘హీరో (శక్తి)’ చిత్రంలో నటించారు. ఆమె తెలుగులో ‘చిత్రలహరి’, ‘హలో’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరోవైపు, కాయదు లోహర్ ‘డ్రాగన్’ సినిమాతో తెలుగు, తమిళంలో బాగా పాపులర్ అయ్యారు. శివకార్తికేయన్-వెంకట్ ప్రభు కాంబోలో తెరకెక్కనున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.








