సింహాచలం ఆలయంలో జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనపై ఉండవల్లి నివాసంలో ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించిన ఆయన, ఘటన వెనుక కారణాలను వెలికితీయడానికి ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ నియమించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరావులతో కమిటీ ఏర్పాటు చేశారు. 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వం భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సమీక్ష సమావేశానికి డీజీపీ, ఉన్నతాధికారులు హాజయ్యారు.
దేవాదాయ మంత్రి వ్యాఖ్యలపై భక్తుల ఆగ్రహం..
చందనోత్సవంలో అమాయక భక్తులు మృతిచెందడంపై మృతుల కుటుంబీకులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ఘటన సంభవించిందన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు భక్తులకు ఆగ్రహం తెప్పిస్తోందని, గోడ నాసిరకంగా నిర్మించి ప్రకృతిపై నెపం మోపడం సమంజసం కాదని భక్తులు మండిపడుతున్నారు. ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిందిపోయి.. ప్రకృతి వైపరీత్యమని పక్కదారి పట్టించడం ఏంటని భక్తులు నిలదీస్తున్నారు. మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని, క్షతగాత్రులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.