సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పాశమైలారం (Pashamylaram) పారిశ్రామిక వాడ (Industrial Area)లోని జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సిగచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Sigachi Industries Private Limited)లో భారీ రియాక్టర్ పేలుడు (Reactor Explosion) సందర్భంలో స్పాట్‌లోనే ఐదుగురు కార్మికులు (Five Workers) మృతిచెందారని వార్తలు వచ్చినప్పటికీ.. ఆ సంఖ్య 12కు చేరుకుంది. పేలుడు ధాటికి గాయపడిన క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, గత మూడు గంటలుగా ప్రమాద స్థలంలోనే ఉంటూ రెస్క్యూ ఆపరేషన్‌లను పర్యవేక్షిస్తున్నారు.
సిగచి ఇండస్ట్రీస్‌లో మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ మరియు ఫార్మా ఉత్పత్తుల తయారీ జరుగుతుంది. సోమవారం ఉదయం ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదానికి గల కారణాలు ఇప్పుడే చెప్పలేమని మంత్రి తెలిపారు. ప్రమాద సమయంలో 65 మంది కార్మికులు ఉన్నారని, జనరల్ షిఫ్ట్‌లో 25 మంది ఉన్నట్లుగా తమకు సమాచారం ఉందన్నారు. ప్రమాదంలో మూడు అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిపోయిందని, ఇప్పటి వరకు 12 మంతి ఈ ప్రమాదంలో చనిపోయారని, తవ్వకాల్లో నాలుగు మృతదేహాలను వెలికితీశామని మంత్రి చెప్పారు.
భారీ పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడిన కార్మికుల్లో 34 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 12 మంది ఐసీయూ (ICU)లో ఉన్నారని, వారు అందరూ వెంటిలేటర్‌పై ఉన్నారని చెప్పారు. 70 నుండి 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయని చెప్పారు. శిథిలాలు క్లియర్ చేసిన తరువాత మృతుల సంఖ్య స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ మేనేజర్ కూడా చనిపోయాడని తెలిపారు. ఫ్యాక్టరీలోని కార్మికుల వివరాలకు సంబంధించిన అన్ని పత్రాలు కాలిబూడిదయ్యాయన్నారు.
ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి, 11 అగ్నిమాపక వాహనాలు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, రెస్క్యూ బృందాలను రంగంలోకి దించింది. మంత్రి దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రవీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్‌లతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించి, బాధితులకు అన్ని రకాల సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాన్ని రాజకీయం చేయవద్దని, బాధిత కుటుంబాలకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ స్పష్టం చేశారు.