ఏపీలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఎంతో ఇష్టంతో కష్టపడి చదివి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి ఆల్ ఇండియా సర్వీస్ (All India Service)కు సెలక్ట్ అయిన అధికారి తన సర్వీస్ నుంచి వైదొలిగేందుకు సిద్ధమయ్యాడు. 2012 బ్యాచ్‌కు చెందిన అధికారి ఇంకా ఎంతోకాలం సమాజానికి సేవ చేయాల్సి ఉండగా అర్ధాంతరంగా తన సర్వీస్‌ను ముగించేందుకు వాలంటరీ రిటైర్మెంట్ (Voluntary Retirement)కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది.
2012లో ఏపీ (AP) నుంచి ఐపీఎస్ ఆఫీసర్ (IPS Officer)గా సెలక్ట్ అయిన సిద్ధార్థ్ కౌశల్ (Siddharth Kaushal) తన ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ (వీఆర్ఎస్)(VRS) కోసం దరఖాస్తు చేశారు. డీజీపీ కార్యాలయంలో అడిషనల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్)గా విధులు నిర్వహిస్తున్న ఆయన, గత నెల రోజులుగా విధులకు హాజరు కావడం లేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అనూహ్యంగా ఓ ఆల్ ఇండియా సర్వీస్ స్థాయి అధికారి వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడంపై చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో పోలీసు శాఖలో గతేడాది నుంచి కొనసాగుతున్న అసంతృప్తి, వేధింపులే ఇందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్‌లను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తోందని, ఇది సిద్ధార్థ్ రాజీనామాకు ప్రధాన కారణమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సిద్ధార్థ్ కౌశల్ గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో ఎస్పీగా, ఆక్టోపస్ ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. అనేక అవార్డులు కూడా అందుకున్నారు.
కూటమి ప్రభుత్వం గతేడాదిగా 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వలేదు. అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయిలో 119 మందిని పక్కనపెట్టింది. డీజీ స్థాయి అధికారులైన పీఎస్‌ఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్ కుమార్, అదనపు డీజీ సంజయ్, ఐజీ కాంతి రాణా, డీఐజీ విశాల్ గున్నీలపై కేసులు నమోదు చేసి సస్పెన్షన్ విధించి, వేధిస్తోందనే ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ వంటి అధికారులు రాజకీయాలు తట్టుకోలేక కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారని, సిద్ధార్థ్ కౌశల్ కూడా ఇదే బాటలో వీఆర్ఎస్ ద్వారా బయటకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఘటన రాజకీయ కక్ష సాధింపు చర్యలను ప్రశ్నిస్తూ, రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల భవిష్యత్తుపై కీలక చర్చకు దారితీసింది.







