భారత క్రికెట్ జట్టుకు టెస్ట్, వన్డే ఫార్మాట్లలో ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్‌గా ఉన్నాడు. అక్టోబర్ 4న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) గిల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. అయితే, రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంపై పలు ప్రశ్నలు, ఊహాగానాలు తలెత్తగా, హిట్‌మ్యాన్ అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కెప్టెన్సీ మార్పుపై గిల్ స్పందన
రోహిత్ శర్మ (Rohit Sharma)ను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించే విషయం తనకు కొంత ముందుగానే తెలుసు అని శుభ్‌మన్ గిల్ మీడియా సమావేశంలో వెల్లడించాడు. “అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ కోసం జట్టును ప్రకటించారు. అంతకుముందే నాకు కెప్టెన్సీ విషయం తెలుసు” అని గిల్ చెప్పాడు.
టీమిండియాకు కెప్టెన్‌గా ఉండటం ఎప్పుడూ గౌరవమే అని పేర్కొన్న గిల్, కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. “మైదానంలో రోహిత్ శర్మ చాలా ప్రశాంతంగా ఉంటాడు. కెప్టెన్‌గా జట్టులో నెలకొల్పిన స్నేహపూర్వక వాతావరణాన్ని నేనూ కొనసాగిస్తా. ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతాం. వచ్చే కొన్ని నెలలు చాలా ముఖ్యం,” అని గిల్ అన్నాడు.
రోహిత్, కోహ్లీ భవితవ్యంపై…
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న నేపథ్యంలో వారి భవితవ్యంపై వస్తున్న ఊహాగానాల గురించి కూడా గిల్ మాట్లాడాడు.
“బయటి వ్యక్తులు రకరకాల మాటలు అంటుంటారు. వారిద్దరి భవితవ్యంపై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. వారిద్దరూ భారత జట్టును ఎన్నో మ్యాచులలో గెలిపించారు. ఇద్దరూ అద్భుతమైన నైపుణ్యం గల క్రికెటర్లు. జట్టుకు వారి అవసరం చాలా ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా సిద్ధమవుతున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం,” అని శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు.








