చంద్రబాబు రాజకీయాలకు ఇద్దరు బలి

చంద్రబాబు రాజకీయాలకు ఇద్దరు బలి

చంద్రబాబు ఫక్తు రాజకీయాలకు ఇద్దరు బలయ్యారు. ఒకరు తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి కాగా, మరొకరు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్. గత ఐదేళ్లు వైయస్ జగన్ సర్కారుపై దుష్ప్రచారాలకు మైకులా జీవీ రెడ్డిని వాడుకున్న చంద్రబాబు చివరికి కూరలో కరివేపాకులా అతన్ని విసిరి పారేశాడు.

నాడు బాబు అసత్యాలకు మైకులా జీవీ రెడ్డి
వైయస్ జగన్ సర్కారుపై చంద్రబాబు ఎన్నో విష ప్రచారాలు చేశారు. తన అవసరాల కోసం జీవీ రెడ్డిని బాబు అండ్ కో ప్రమోట్ చేశారు. అది నిజమేనని నమ్మి జీవీ రెడ్డి మరింత దూసుకెళ్లారు. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహా అనేక అంశాలపై తప్పుడు ప్రచారానికి మైకులా జీవీ రెడ్డి పనిచేశారు. వైయస్సార్ సీపీ ప్రభుత్వాన్ని తిడుతుండడంతో టీడీపీ అనుకూల‌ మీడియా జీవీ రెడ్డిని అందలం ఎక్కించింది. దీంతో ఏబీఎన్, టీవీ 5 డిబేట్లలో త‌ర‌చుగా జీవీరెడ్డిని వాడేవారు. త‌నకు తిరుగులేదని, అధికారంలోకి వస్తే పిలిచి విస్తరాకు వేసి వడ్డిస్తారని ఆశించారు. నామినేటెడ్ పోస్టు కోసం ఎదురుచూశారు. మొదటి లిస్టులో తన పేరు లేకపోవడంతో తీవ్ర అవమానంగా భావించారు. దీంతో టీడీపీ అనుకూల‌ మీడియా వేదిక‌పైనే అసమ్మతి రాగం వినిపించారు. తనకు పదవి కంటే.. గౌరవం ముఖ్యమని, చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అని ఏబీఎన్ డిబేట్‌లోనే అస‌మ్మ‌తి తూటా పేల్చారు.

పదవులు కాదు…గౌరవం కోరుకుంటున్నా.. జీవీ రెడ్డి(24 సెప్టెంబర్ 2024న డిబేట్ లో)
పదవులు ఎవరు కోరుకోరు?..మనం పనిచేశాం. గౌరవం కోరుకుంటున్నాం.. ముసుగులో గుద్దులాట ఏముంది. కార్పొరేషన్ పదవుల ఫస్ట్ లిస్టులో నా పేరు లేదు.. నేను సంతోషంగా లేను. నేనేమీ ఎమోషనల్ అవ్వడం లేదు కానీ.. పదవి రావటం వేరు.. గౌరవంగా రావటం వేరు. ఆ నేపథ్యంలో మొదటి లిస్ట్ లో డెఫినెట్ గా వస్తుందని ఆశించా. తర్వాత లిస్టులో మంచి పోస్టులే ఉన్నాయి. కానీ.. ఫస్ట్ లిస్ట్ లో ఇస్తే.. అది ఏ పదవైనా ఆనందంగా ఉంటుంది. రోజులు తరబడి వ్యాల్యుబుల్ టైం పార్టీకోసం పెట్టాం.. మేము గౌరవం కోరుకున్నాం.. మొదటి లిస్టులో రాకపోతే.. రెండో.. మూడో లిస్టులో ఇచ్చినా.. నెగ్లెక్ట్ చేసినట్టు భావించాల్సి వస్తుంది. లిస్టులో మా పేర్లు లేకపోతే.. ముందే మీకివ్వడం లేదని చెప్పాలి.. మీరు ఆశించొద్దని చెప్పాలి. అప్పుడు పదవి రాకపోయినా బాధనిపించదు.
సీఎంవోలో కపర్ది అనే వ్యక్తిని తీయకపోతే సార్ (చంద్రబాబు)కి చెడ్డ పేరు వస్తుంది. సార్ కి ఎందుకు చెడ్డపేరు వస్తుందంటే.. ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోలేడు.

పదవి ఒక‌రికి.. పెత్తనం మరొకరికి..
కూటమి ప్రభుత్వం వచ్చాక కార్పొరేషన్ పదవుల పందేరంలో భాగంగా రెండో జాబితాలో జీవీ రెడ్డికి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. బాధ్యతలు చేపట్టగానే పార్టీ డైరెక్షన్ లో గత ప్రభుత్వంపై నిందలు, అర్ధసత్యాలు, అబద్ధాలు వల్లె వేశారు. చంద్రబాబు తనకు నిజమైన అధికారాలు ఇచ్చినట్టుగా భావించిన జీవీ రెడ్డి ఫైబర్ నెట్ లో స్వతంత్రంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. కానీ నిదానంగా పరిస్థితి అర్థమైంది. ఫైబర్ నెట్ కు షాడో చీఫ్ గా ఇప్పటికే వేమూరి హరికృష్ణ వ్యవహరిస్తున్నార‌ని, గతంలో స్కాంలు చేసి కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీ చేసిన వేమూరి గ్యాంగ్ పిడికిలిలోనే ఇప్పటికీ ఫైబర్ నెట్ ఉందన్న ఆరోప‌ణ‌లున్నాయి. వారికి అడ్డంగా మారిన జీవీ రెడ్డిని తప్పించేందుకు పొగ బెట్టే ప్రయత్నాలను వేమూరి గ్యాంగ్ వేగవంతం చేసింది.

జీవీ రెడ్డి ఉక్కిరిబిక్కిరి
ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి 20న జీవీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వం, అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ దినేష్ కుమార్ గత ఆగస్టులో ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫైబర్ నెట్ పై ఫోకస్ చేయలేదని ఆరోపించారు. దినేష్ కుమార్ తన మాట వినడం లేదని, షోకాజ్ నోటీసుకు సమాధానం కూడా ఇవ్వలేదని జీవీ రెడ్డి ఓపెన్ అయ్యారు. ఫైబ‌ర్ నెట్ ఎంపీ దినేష్ కుమార్ రాజ‌ద్రోహానికి పాల్ప‌డుతున్నాడంటూ జీవీ రెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఫైబర్‌ నెట్‌ అభివృద్ధికి ఏ మాత్రం సహకరించకపోగా, సంస్థను మూసివేసే విధంగా ఆయన చర్యలున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.

భగ్గుమన్న ఐఏఎస్‌ అధికారులు
ఈ ఆరోపణలపై ఐఏఎస్‌ అధికారులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. అధికారుల ఆగ్రహాన్ని గమనించిన ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యల‌కు దిగింది. సంధి చేయ‌డానికి జీవీ రెడ్డి, దినేష్‌కుమార్‌ల‌ను పిలిచి మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి మాట్లాడారు. అన్ని ఆరోపణలపై ఆధారాలతో వివరణ ఇవ్వాలని జీవీ రెడ్డిని మంత్రి ఆదేశించారు. సీఎం కూడా జీవీ రెడ్డిని పిలిచి తీవ్రంగా మందలించినట్లు స‌మాచారం. అసత్య ఆరోపణలు, అర్థంలేని మాటలతో పలచనకావొద్దని గట్టిగా హెచ్చరించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాబు మార్కు రాజకీయానికి జీవీ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. త‌న‌కు అడ్డుపడుతున్న అధికారికి అందరూ మద్దతు పలుకుతున్నారని, గౌరవం లేని చోట పనిచేయడం కష్టమంటూ సన్నిహితుల వద్ద జీవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తన ఆవేదనను ముఖ్య నేత పట్టించుకోకపోగా.. వెళ్తే వెళ్లిపోవ‌చ్చంటూ చెప్పకనే చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన రాజీనామా చేయడం గమనార్హం. మొత్తం వ్యవహారంలో తెరవెనుక వేమూరి గ్యాంగ్ హస్తం ఉందన్నది సుస్పష్టం.

దినేష్‌కుమార్‌పైనా వేటు..
జీవీరెడ్డి రాజీనామాతో ఒక్క‌సారిగా టీడీపీ క్యాడ‌ర్ ఉలిక్కిప‌డింది. దీంతో డ్యామేజీ కంట్రోల్ కోసం జీవీరెడ్డి ఆరోప‌ణ‌లు చేసిన అధికారిపైనా ప్ర‌భుత్వం బ‌దిలీ వేటు వేసి చేతులు దులుపుకుంది. ఫైబర్‌నెట్‌ ఎండీగా ఉన్న దినేష్‌కుమార్‌ను జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని సోమవారం సీఎస్‌ విజయానంద్‌ ఉత్తర్వులు జారీచేశారు. చివరికి బాబు రాజకీయానికి ఇద్దరు బలయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment