హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో అరెస్టు అయిన మస్తాన్ సాయి గురించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా, అతను వారిని బ్లాక్‌మెయిల్ చేయడానికి కొత్త పద్ధతులు అనుసరించాడని బయటపడింది. 300మందికి పైగా యువతులను వలలో వేసుకుని, నగ్న వీడియోలు రికార్డ్ చేసి, వారిని బ్లాక్‌మెయిల్ చేసేవాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి పేరుతో యువతులను మోసం చేస్తూ, వారి అనుమతి లేకుండా వీడియోలు తీసిన మస్తాన్ సాయి అసలు రూపం లావణ్య పోలీసులకు అప్పగించిన హార్డ్ డిస్క్ ద్వారా బయటపడింది.
ఈ కేసులో మస్తాన్ సాయితో పాటు మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. BNSS చట్టంలోని 329(4), 324(4), 109, 77, 78 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండగా, మస్తాన్ సాయి పన్నిన పన్నాగాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాధిత మహిళలు గతంలో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, బ్లాక్‌మెయిల్ చేయడానికి మస్తాన్ సాయి “ఆత్మహత్య చేసుకుంటా” అంటూ ఫ్యాన్‌కు ఉరి వేసుకునేలా నటిస్తూ వీడియో కాల్‌లు చేసి, వారిని భయపెట్టేవాడని తెలుస్తోంది.
వందలాది యువతులను మోసం చేసి, వారి వీడియోలు రికార్డ్ చేసి, ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి వారిపై అత్యాచారానికి పాల్పడేవాడని ఆరోపణలు ఉన్నాయి. మస్తాన్ సాయి అరెస్ట్ అనంతరం మరికొంత మంది బాధిత యువతులు ముందుకు వస్తున్నారు. కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని సంచలన వివరాలు బయటపడే అవకాశం ఉందని పోలీసుల వర్గాలు వెల్లడిస్తున్నాయి.