దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో జరిగిన ఓ భయానక హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తిమార్‌పూర్ (Timarpur) ప్రాంతంలో అక్టోబర్ 6న జరిగిన ఈ ఘటనలో, ఓ యూపీఎస్‌సీ అభ్యర్థి (UPSC Candidate)ని అతని ప్రియురాలే క్రూరంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రేమలో మోసం, ప్రతీకారం, కుట్ర అన్ని ఒకేసారి మిళితమైన ఈ కేసు వెనుక భయానక నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రేమలో ద్రోహం
అక్టోబర్ 6న గాంధీ విహార్ (Gandhi Vihar)లోని నాలుగో అంతస్తు ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. ఆ వ్యక్తి రామ్‌కేష్ మీనా (Ramkesh Meena) అనే 32 ఏళ్ల యూపీఎస్‌సీ అభ్యర్థి అని తేలింది. మొదట ఇది ప్రమాదమని అనుకున్న పోలీసులు, తరువాత సీసీటీవీ ఫుటేజ్ చూసి షాక్ అయ్యారు.
ఫుటేజ్‌లో ఇద్దరు ముసుగులు ధరించిన వ్యక్తులు భవనంలోకి ప్రవేశించినట్లు కనిపించింది. వారిలో ఒకరు 39 నిమిషాల తరువాత బయటకు వచ్చాడు. తెల్లవారుజామున 2:57 గంటలకు ఒక మహిళ, మరో వ్యక్తితో కలిసి బయటకు వెళ్తుండగా, వెంటనే ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. దీని తరువాతే నిజం వెలుగులోకి వచ్చింది.
ముగ్గురు అరెస్ట్
దర్యాప్తులో అమృత చౌహాన్ (Amrita Chauhan) అనే మహిళ ఈ హత్య వెనుక ఉన్నట్లు తేలింది. ఆమె తన మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్ (Sumit Kashyap), అతని స్నేహితుడు సందీప్ కుమార్ (Sandeep Kumar, 29)తో కలిసి రామ్‌కేష్‌ను హత్య చేశారు. హత్య అనంతరం వారు మృతదేహంపై నెయ్యి, నూనె, వైన్ (ghee, oil, wine) పోసి, ఎల్పీజీ సిలిండర్ రెగ్యులేటర్ తెరిచి పేల్చారు. దీన్ని అగ్నిప్రమాదంలా చూపించేందుకు ప్రయత్నించారు. ఈ ముగ్గురూ ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ (Moradabad, UP)కు చెందినవారని పోలీసులు తెలిపారు.
హత్యకు కారణం
అమృత తన మాజీ ప్రియుడు రామ్‌కేష్ వద్ద తనకు సంబంధించిన అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నాయని తెలిపింది. వాటిని డిలీట్ చేయమని అడిగినప్పటికీ రామ్‌కేష్ నిరాకరించాడట. ఆ అవమానం, భయంతోనే అమృత ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.





 



