టాలీవుడ్ నటుడు శివాజీ (Shivaji) ఇటీవల మహిళలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఆయన మాటలు మహిళలను అవమానించేలా ఉన్నాయని సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై తాజాగా కాంగ్రెస్ మహిళా నేత సునితా రావు (Sunita Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏ తల్లి కడుపున పుట్టాడో ఆ తల్లినే ఇనుప సామాన్ల డబ్బాతో పోల్చడం అత్యంత నీచమని సునితా రావు తీవ్రంగా మండిపడ్డారు. ఇది పాలు తాగి రొమ్మునే గుద్దినట్లే ఉందని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో శివాజీ ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలు (RSS) కలిగిన బీజేపీ (BJP) తో కలిసి ఉన్నాడని గుర్తుచేశారు. “శివాజీ ఓ ఫ్లాప్ యాక్టర్ (Flop Actor). అతడి గురించి మాట్లాడటమే అనవసరం” అంటూ అసహనం వ్యక్తం చేశారు.
మహిళల దుస్తులపై మాట్లాడే హక్కు శివాజీకి ఎవరిచ్చారని ఆమె ప్రశ్నించారు. ఇద్దరు కొడుకులే కాకుండా ఒక కూతురు ఉంటే మహిళల విలువ ఏమిటో అతడికి తెలిసేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మహిళా కమిషన్ (Women’s Commission) సుమోటోగా కేసు నమోదు చేసిందని, శివాజీపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శివాజీ ఏ వేదికపై ఈ వ్యాఖ్యలు చేశాడో, అదే వేదికపై మహిళలందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు.








