బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty), ఆమె భర్త రాజ్ కుంద్రా (Raj Kundra)కు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బిట్‌కాయిన్ పోంజీ స్కామ్ కేసులో రాజ్ కుంద్రాకు ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు (Special PMLA Court) తాజాగా సమన్లు జారీ చేసింది. రాజ్ కుంద్రాతో పాటు దుబాయ్‌లో నివసిస్తున్న వ్యాపారవేత్త రాజేశ్ సతీజా (Rajesh Sateja)కూ కోర్టు నోటీసులు పంపింది. ఈ నెల 19న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది.
ముంబై కేంద్రంగా పనిచేసిన ‘వేరియబుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్’ (Variable Tech Private Limited) సంస్థ 2017లో ‘గెయిన్ బిట్‌కాయిన్’ (GainBitcoin) పేరిట భారీ పోంజీ స్కీమ్‌ను నిర్వహించింది. బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపుతూ మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) విధానంలో ఏజెంట్ల ద్వారా ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లోని అమాయకుల నుంచి సుమారు రూ.6,600 కోట్లను వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సంస్థతో పాటు దాని ప్రమోటర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈడీ ఈ కేసులో చార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది.
285 బిట్ కాయిన్లు
ఈ స్కామ్‌కు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న అమిత్ భరద్వాజ్ (Amit Bhardwaj) నుంచి రాజ్ కుంద్రా 285 బిట్‌కాయిన్లను స్వీకరించినట్లు ఈడీ తన దర్యాప్తులో వెల్లడించింది. ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్ ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు రాజ్ కుంద్రా వేసినట్లు కూడా పేర్కొంది. ఈ బిట్‌కాయిన్లు ఇప్పటికీ ఆయన వద్దే ఉన్నాయని, వాటి మార్కెట్ విలువ సుమారు రూ.150 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది.
ఈ నేపథ్యంలోనే గత ఏడాది అక్టోబర్‌లో రాజ్ కుంద్రాకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ముంబై జుహు ప్రాంతంలోని నివాస గృహంతో పాటు పావ్నా సరస్సు సమీపంలోని ఫామ్ హౌస్‌ను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ శిల్పా శెట్టి–రాజ్ కుంద్రా దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం బాలీవుడ్ వర్గాల్లోనూ, వ్యాపార రంగంలోనూ విస్తృత చర్చకు దారి తీస్తోంది.







