శంషాబాద్‌లో పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌లో ఓ సినిమా థియేటర్ వద్ద 15 గ్రాముల ఎండిఎంఏ (MDMA) విక్రయిస్తుండగా మహారాష్ట్రకు చెందిన అభిషేక్ సంజయ్ అనే వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అభిషేక్ గతంలో మహారాష్ట్రలో కిరాణా షాపు నడిపేవాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో బెంగళూరుకు వెళ్లి డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో సేకరించాడు.
అలా నైజీరియన్ వ్యక్తితో పరిచయం ఏర్పడి, అతని ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేయడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత, వాటిని విక్రయించే స్థాయికి చేరుకున్నాడు. చివరకు శంషాబాద్‌లో ఓ సినిమా థియేటర్ వద్ద విక్రయించే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుని వద్ద స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.1.80 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.