సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ (IPS Officer) సర్వీస్ రివాలర్ (Service Revolver)తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన మంగళవారం హర్యానా (Haryana)లో వెలుగు చూసింది. హర్యానా రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పురాన్ కుమార్ (Puran Kumar).. చండీగఢ్ (Chandigarh)లోని సెక్టార్ 11లోని తన నివాసంలో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక సీనియర్ పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆయన ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలియరావల్సింది ఉందని అధికారులు తెలిపారు. ఆయన సర్వీస్ రివాల్వర్‌ను సోమవారం తన గన్‌మ్యాన్ నుండి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పురాన్ కుమార్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉన్నారు. ఆయనను సెప్టెంబర్ 29న రోహ్తక్లోని సునారియాలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో (PTC) నియమించారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో చండీగఢ్ పోలీసు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కన్వర్దీప్ కౌర్ ఉన్నారు. పూరణ్ కుమార్ భార్య, హర్యానా క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి అయిన అమ్నీత్ పి. కుమార్ ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో లేరు. ఆమె ప్రస్తుతం హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలో ఓ అధికారిక ప్రతినిధి బృందంతో కలిసి జపాన్ పర్యటనలో ఉన్నారు.








