తెలంగాణ (Telangana)లో ప్రస్తుతం లోకల్ బాడీ ఎన్నికల (Local Body Elections) హడావిడి నడుస్తోంది. సర్పంచ్ పదవికి నామినేషన్లు, ప్రచార పర్వం, కొన్ని చోట్ల ఏకగ్రీవాలతో గ్రామ స్థాయి లీడర్లు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా, నల్లగొండ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయడానికి ఏకంగా వేలంపాట నిర్వహించడం సంచలనం రేపింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా, అనంతరం గ్రామాభివృద్ధి, కనకదుర్గ ఆలయ నిర్మాణం కోసం ఒకే వ్యక్తిని ఎన్నిక చేయాలని నిర్ణయించారు. అభ్యర్థుల మధ్య జరిగిన చర్చల తరువాత సర్పంచ్ (Sarpanch) పదవిని వేలంపాటకు(Auction) పెట్టగా, అత్యధికంగా రూ.73 లక్షలు ప్రకటించిన మహమ్మద్ సమీనా ఖాసీం (Mohammed Sameena Qasim) ఆ పదవిని కైవసం చేసుకున్నారు. ఈ మొత్తం గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిందిగా నిర్ణయించడం ప్రత్యేకంగా నిలిచింది.
వేలంపాట ఫలితాన్ని అంగీకరిస్తూ మిగతా 10 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకుంటామని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఈసారి ఏకగ్రీవంగా ఎన్నికైందని అధికారులు ప్రకటించనున్నారు. సర్పంచ్ పదవిని ఇంత భారీ మొత్తానికి వేలం వేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. గ్రామాభివృద్ధి పేరుతో తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు సమంజసం అనే దానిపై సామాజిక వర్గాల్లో చర్చ సాగుతోంది.








