సంక్రాంతి రద్దీ.. నందిగామ వద్ద ట్రాఫిక్ జామ్.. గుంతల రోడ్లతో ప్రయాణికుల అవస్థలు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ (Sankranti Festival) సందడి ప్రారంభమైంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో నగరాల్లో స్థిరపడిన వారు పల్లెబాట పట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని స్వస్థలాలకు వెళ్లే వాహనాలతో రహదారులు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ రద్దీ (Heavy Traffic Congestion) ఏర్పడింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ (Nandigama) వద్ద పరిస్థితి మరింత దారుణంగా మారింది. జాతీయ రహదారిపై హైవే అండర్‌పాస్ బ్రిడ్జికి అనుసంధానంగా ఉన్న అప్రోచ్ రోడ్డును సరిగా నిర్మించకపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయంగా సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాల రాకపోకలు సాగుతున్నప్పటికీ, అక్కడ కూడా పెద్ద పెద్ద గుంతలు ఉండటంతో ప్రయాణం నరకయాతనగా మారింది.

సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా కిలోమీటర్ల మేర కార్లు బారులు తీరాయి. నందిగామ మీదుగా హైవేపై వచ్చే వాహనాలే కాకుండా, నందిగామ వై జంక్షన్ నుంచి పట్టణంలోకి వెళ్లే రహదారిలో కూడా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

పండుగ వేళ వాహనాల రద్దీ భారీగా ఉంటుందని తెలిసినా, ఆర్ అండ్ బీ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సర్వీస్ రోడ్లపై గుంతలను పూడ్చకపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో విజయవాడ డీసీపీ లక్ష్మీనారాయణ, సీఐ లచ్చు నాయుడు సంఘటనా స్థలాన్ని సందర్శించి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ రోడ్ల మరమ్మతులు పూర్తిగా చేపట్టే వరకు ప్రయాణికుల ఇబ్బందులు తప్పేలా లేవని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment