విమానాల్లో విపరీతమైన రద్దీ నెలకొంటుండటంతో పాటు, పట్టణాల నుంచి గ్రామాల వైపు వెళ్లే ప్రధాన రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని ముందుగానే అంచనా వేసిన దక్షిణ మధ్య రైల్వే (South Central Railway), సంక్రాంతి సీజన్‌కు (Sankranti Festival Season) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతున్నామని, అవసరాన్ని బట్టి జంట నగరాల నుంచి సుమారు 600 వరకు ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ (CPRO Sridhar) తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, లింగంపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి నడవనున్నాయని ఆయన వెల్లడించారు.
సంక్రాంతి ప్రయాణానికి నెల రోజుల ముందుగానే ప్రత్యేక రైళ్లను ప్రకటించినప్పటికీ, ముందస్తు బుకింగ్‌లతో రిజర్వేషన్లు వేగంగా నిండిపోతున్నాయని తెలిపారు. వెయిటింగ్ లిస్ట్ పరిస్థితిని బట్టి మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం, తిరుపతి మార్గాల్లో భారీ డిమాండ్ ఉందని పేర్కొన్నారు.
ఈసారి హైదరాబాద్ నుంచి రైళ్ల ద్వారా 30 లక్షల మందికిపైగా ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తుండగా, సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనుల మధ్య కూడా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా భద్రతా, సౌకర్య చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్లలో అదనపు చార్జీలు వర్తిస్తాయని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.








