సంక్రాంతి పండుగ ముగిసింది. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల పండుగలో కుటుంబ సభ్యులు, బంధువులతో సందడిగా గడిపారు ప్రజలు. కోళ్ల పందాలు, గుండాట వంటి ఆటలలో పాల్గొంటూ ఆనందంగా ఉంటే, కొందరు డబ్బులు పోగొట్టుకోగా మరికొందరు సంపాదించారు. సొంత ఊర్లలో సొంతవారిని కలిసి ఆనందంగా గడిపిన బరువెక్కిన గుండెతో ప్రజలు పల్లె విడిచి పట్నం దారిపట్టారు.
పల్లెకు బైబై.. నగర బాట
సంక్రాంతి ముగియడంతో ప్రజలు పల్లె నుంచి తిరిగి నగరాలకు బయలుదేరారు. హైదరాబాద్ చేరుకునే ప్రయాణికులతో రహదారులు రద్దీగా మారాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ కీసర టోల్ గేట్ వద్ద భారీగా వాహనాల రద్దీ కనిపించింది. గత మూడు రోజుల్లో పండుగ ముగించుకున్న ప్రయాణికులు పట్నం బాట పట్టారు.
ప్రత్యేక సర్వీసులతో రవాణా ఏర్పాట్లు
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈనెల 19 వరకు ఈ ప్రత్యేక సేవలు కొనసాగుతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులను నడుపుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ అధిక టికెట్ ధరలతో ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. రవాణా అధికారులకు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రవాణా భద్రతలను పాటించాలని సూచించింది. ప్రభుత్వ చొరవతో ప్రత్యేక సర్వీసుల ద్వారా గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేపట్టారు.