సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ పండుగకు ప్రయాణికులను సొంతూళ్లకు చేర్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ 7200 ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. సంక్రాంతి సమయంలో ఎక్కువ ప్రయాణికులు ఉంటారని, జనవరి 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 3900 అదనపు బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు సంస్థ ఎండీ ప్రకటించారు.
ఇందులో హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 2,153 ప్రత్యేక బస్సులు, బెంగళూరు నుంచి 375 ప్రత్యేక బస్సులు, విజయవాడ నుంచి 300 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు. తిరుగు ప్రయాణానికి ఈ నెల 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులను నడపనున్నామని ఎండీ పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఒకేసారి రెండు వైపులా టికెట్లు బుక్ చేసుకున్న వారికి టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు సంస్థ వెల్లడించింది. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించామన్నారు.








