పార్వతీపురం మన్యం జిల్లా (Parvathipuram Manyam District) సాలూరు (Salur)లో ఓ మహిళ తీవ్రమైన వేధింపులకు (Harassment) గురవుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త కోల్పోయిన బాధతో, గుండెజబ్బుతో బాధపడుతున్న ఓ చిన్నారి బాధ్యతతో జీవనం కొనసాగిస్తున్న ఈ మహిళను రాష్ట్ర మహిళా మంత్రిగారి (State Women Minister) అనధికార పీఏ(PA) వేధిస్తున్నాడని బాధితురాలు బయటపెట్టిన ఆధారాలు కలకలం రేపుతున్నాయి.
కారుణ్య నియామకం కోసం వెళ్తే..
2021లో కరోనా మహమ్మారితో సాలూరుకు చెందిన ఓ ఉపాధ్యాయుడు మరణించాడు. భర్త మృతితో తీవ్ర దుఃఖంలో ఉన్న ఆమె, కారుణ్య నియామకం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే సమయంలో అదే వీధిలో నివసించే సతీష్ (Satish) అనే వ్యక్తి మాయమాటలు చెప్పి జోక్యం చేసుకున్నాడని ఆరోపణ. ప్రస్తుత జిల్లాకు చెందిన మంత్రిగారి అనధికార పీఏగా వ్యవహరిస్తున్నాడని చెప్పుకుంటూ, నియామకానికి ఖర్చులు ఉంటాయని చెప్పి తన నుంచి రూ.5 లక్షలు తీసుకున్నాడని బాధితురాలు తెలిపింది. టీడీపీ(TDP) నేతల పక్కలో పడుకోవాలంటూ తనను టార్చర్ చేసేవాడని బాధిత మహిళ కన్నీరు పెట్టుకుంది.
ఉద్యోగంలో చేరిన తర్వాత సతీష్ ఆమెను తన వశంలో పెట్టుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపిస్తోంది. అది సాధ్యం కాకపోవడంతో, ఆమెకు వచ్చిన ఉద్యోగాన్ని కూడా టార్గెట్ చేశాడని బాధితురాలు వెల్లడించింది. విద్యాశాఖలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు నియమితురాలైన తరువాత, సతీష్ ఎలాంటి లంచాలు ఇవ్వకుండా ఉద్యోగం వచ్చిందన్న విషయం తెలిసి మరింత ఆగ్రహించాడని బాధితురాలు చెబుతోంది. దాంతో పగ పెంచుకుని, ఆమెను సాలూరు నుంచి గుమ్మలక్ష్మీపురం మండలంలోని అత్యంత దూరపు గిరిజన ప్రాంతంలో ఉన్న పాఠశాలకు అకస్మిక బదిలీ చేయించినట్లు ఆరోపించింది.
మంత్రిని సంప్రదించినా.. పీఏకే వత్తాసు
బదిలీపై, అనధికారి పీఏ దురాగతాల గురించి ఫిర్యాదు చేసినప్పటికీ మంత్రి గారు సతీష్‌ను కాపాడారని, తన ఫిర్యాదు సీరియస్‌గా తీసుకోలేదని ఆమె చెబుతోంది. దాంతో చివరికి విద్యాశాఖ మంత్రివర్గాన్ని, అనంతరం హైకోర్టును ఆశ్రయించింది. అక్రమంగా జరిగిన బదిలీపై ఆమె పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు బాధితురాలు పక్షాన తీర్పు ఇచ్చి, బదిలీని నిలిపివేసింది.
వేధింపులపై పూర్తి విచారణ అవసరం
బాధితురాలు బయటపెట్టిన వివరాలు, ఆడియో–వీడియో ఆధారాలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కారుణ్య నియామకం పేరుతో డబ్బులు డిమాండ్ చేయడం, మహిళను తన వశం చేసుకునేందుకు ఒత్తిడి, పగపట్టి బదిలీ చేయించడం వంటి ఆరోపణలపై అధికార వర్గాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.








