కల్తీ లడ్డు (Adulterated Laddu) వివాదంపై అధికార తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) చేస్తున్న ప్రచారంపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తీవ్రంగా స్పందించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన “చంద్రబాబు కుట్ర రాజకీయాలు దేవుడినీ వదలడం లేదు. చంద్రబాబు (Chandrababu) కుట్రకు దేవుడైనా(God) బలవ్వాల్సిందే. ఆయన కుట్ర రాజకీయాలు అలా ఉంటాయి.
తిరుమల లడ్డూ విషయంలో సిట్ విచారణను పక్కదారి పట్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. సిట్ బృందంలో తన అనుచరులను ఉంచి కేసును దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు.
“నాణ్యతలేని నెయ్యి గుర్తించిన వెంటనే వైవీ సుబ్బారెడ్డిను సరఫరా నిలిపివేశారు. అదే సమయంలో ల్యాబ్‌లను అభివృద్ధి చేసి, అవసరమైన టెస్టులు నిర్వహించారు. బోలేబాబా సంస్థ పామాయిల్ కలిపిందని సిట్ రిమాండ్ రిపోర్టులో ఉన్నా.. అది ఎప్పుడు జరిగిందన్నది స్పష్టత లేదు. ఆగస్టులో నాణ్యతలేని నెయ్యి వచ్చిందని రాసి ఉంది. ఆ సమయంలో అధికారంలో చంద్రబాబు ప్రభుత్వం ఉండేది. అలాంటప్పుడు మా ప్రభుత్వంపై ఆరోపణలు ఎలా వేస్తారు?” అని ప్రశ్నించారు.
“వైసీపీ హయాంలో రూ.319కు నెయ్యి కొనుగోలు చేశాం, చంద్రబాబు హయాంలో మాత్రం రూ.273కే కొన్నారు. మరి అప్పుడు సరఫరా అయినది కల్తీ నెయ్యి కాదా? రేపు జరగబోయే మెడికల్ కాలేజీల ర్యాలీలను పక్కదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. నిజంగా కల్తీ జరిగిందని భావిస్తే వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదు” అని సజ్జల ప్రశ్నించారు.
“దేవుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదు. భక్తుల మనోభావాలను దెబ్బతీయడం అనాగరికం. నిజంగా ధైర్యం ఉంటే సీబీఐ విచారణ జరిపించండి. రాష్ట్ర అధికారులను సిట్‌లో పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తప్పు. సనాతన ధర్మం పేరిట నాటకం ఆడుతున్న చంద్రబాబు, ఆవు మాంసం అమ్మకాలపై నోరు విప్పరాదే ఎందుకని?” అని సజ్జల ప్రశ్నించారు.







