బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన దుండగుడి గురించి పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన ముంబై పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీస్ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దుండగుడు బంగ్లాదేశ్ పౌరుడని, భారత పౌరుడిగా చూపించుకునేందుకు ఎలాంటి సరైన ఆధారాలు లేవని ముంబై పోలీసులు వెల్లడించారు. దుండగుడి పేరు మహమ్మద్ షరిపుల్ ఇస్లామ్ షెహజాద్ (వయసు 30). అతడు బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి, విజయ్ దాస్ అనే నకిలీ పేరుతో జీవిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దాడి వెనుక అసలు ఉద్దేశం
నిందితుడు చోరీ చేయాలనే ఉద్దేశంతోనే సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నామని ప్రాథమిక విచారణ పూర్తయిందని తెలిపారు. మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు నిందితుడిని కోర్టులో హాజరు పరిచి కస్టడీ కోరనున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు దొంగ దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. సైఫ్ వెన్ను నుంచి కత్తిని తొలగించిన డాక్టర్లు.. అతన్ని ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌కు షిఫ్ట్ చేసినట్లుగా తెలిపారు. ఈ ఘటన సెలబ్రిటీల భద్రత పట్ల కొత్త ఆలోచనలను రేకెత్తించింది. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.