పిల్లలు తమ జీవితంలో విజయం సాధించి, తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇస్తే అంతకంటే గొప్ప సంతోషం మరొకటి ఉండదు. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కూడా ఇప్పుడు అదే ఆనందంలో ఉన్నారు. ఆయన కుమార్తె (Daughter) సారా టెండూల్కర్ (Sara Tendulkar) ముంబై (Mumbai)లో తన సొంత(Own) పైలేట్స్ స్టూడియో (Pilates Studio)ను ప్రారంభించి, కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ సందర్భంగా సచిన్ ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు.
సారా కష్టానికి సచిన్ ముగ్ధుడయ్యారు
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తన కుమార్తె సారా ఎంతో కష్టపడి, నమ్మకంతో ఈ స్థాయికి వచ్చినందుకు ఆయన చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. సారా కొత్త వృత్తి తనకు ఎంతో ఇష్టమైనదని చెబుతూ, ఆమె తన కలను నిజం చేసుకోవడానికి తీవ్రంగా కృషి చేసిందని ప్రశంసించారు.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో సారాకు మద్దతుగా ఆమె తండ్రి సచిన్, తల్లి అంజలి టెండూల్కర్ (Anjali Tendulkar) పాల్గొన్నారు. అంతేకాకుండా, సారాకు కాబోయే వదిన సానియా చందోక్ కూడా ఈ ప్రారంభోత్సవంలో కనిపించారు. అందరితో కలిసి సారా తన స్టూడియో రిబ్బన్‌ను కత్తిరించారు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సారా సోదరుడు అర్జున్ టెండూల్కర్ మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు.
సచిన్ ఎమోషనల్ పోస్ట్
సారాపై తనకున్న ప్రేమను, గర్వాన్ని వ్యక్తపరుస్తూ సచిన్ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. “తల్లిదండ్రులుగా, మీరు మీ పిల్లలు నిజంగా ఇష్టపడే పనిని చేయాలని ఎప్పుడూ కోరుకుంటారు. సారా తన పైలేట్స్ స్టూడియోను ప్రారంభించడం చూసి మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ఆమె కష్టపడి, ఎంతో నమ్మకంతో ఈ ప్రయాణాన్ని అంచెలంచెలుగా నిర్మించుకుంది. పోషకాహారం (న్యూట్రిషన్), శారీరక వ్యాయామం మా జీవితాలలో ఎప్పుడూ ముఖ్యమైనవే. ఇప్పుడు సారా అదే ఆలోచనను తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తుండటం మాకు ఎంతో గర్వంగా ఉంది. నీవు ప్రారంభించబోయే ఈ కొత్త ప్రయాణానికి మా హృదయపూర్వక అభినందనలు!” అని సచిన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.








