కేరళలోని పవిత్ర క్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో దర్శనాలు జరుగుతున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ భక్తుడు వాటర్‌బాటిల్ ధరపై ప్రశ్నించడంతో ప్రారంభమైన వాగ్వాదం, క్షణాల్లో హింసాత్మకంగా మారింది. భక్తుడు వాటర్ బాటిల్ ధరను ప్రశ్నించినందుకు ఆగ్రహం చెందిన స్థానిక వ్యాపారి, భక్తుడి తలపై గాజు సీసాతో దాడి చేశాడు. దెబ్బకు భక్తుడి తలకు గాయం కావడంతో వెంటనే అక్కడ ఉన్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడి తర్వాత కూడా పరిస్థితి శాంతించలేదు. అదే సమయంలో మరో హైదరాబాద్‌కు చెందిన భక్తుడి మాలను వ్యాపారి తెంపేశాడు. భక్తుల మాలపై దాడి చేయడం మరింత తీవ్రతకు దారితీసింది. వెంటనే తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని, ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది శబరిమల ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది.
భక్తుల నిరసనకు ప్రతిగా స్థానిక వ్యాపారులు కూడా గుమికూడడంతో పరిస్థితి మరింత చెడిపోయేలా మారింది. రెండు వర్గాల మధ్య మాటల దాడులు, తోపులాటలు చోటుచేసుకోవడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ మధ్య ఈ సంఘటన పెద్ద కలకలం రేపింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ఇరువర్గాలను చెదరగొట్టి ఉద్రిక్తతను అదుపులోకి తీసుకున్నారు. గాజు సీసాతో దాడి చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శబరిమల ఆలయ ప్రాంగణంలో ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.








