శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల యాత్ర సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. ఇకపై శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులు తమ పవిత్రమైన ఇరుముడిని విమాన ప్రయాణ సమయంలో చెక్-ఇన్ లగేజీ కాకుండా, చేతి సామానుగా తమతో తీసుకెళ్లవచ్చని ప్రకటించారు.
ఇప్పటి వరకు అమల్లో ఉన్న భద్రతా నిబంధనల ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీగా ఇవ్వాల్సి రావడం వల్ల భక్తులు పలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీక్షలో ఉండే భక్తులకు ఇది అసౌకర్యంగా మారడంతో, వారి విశ్వాసాన్ని కాపాడేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అనేక వర్గాలు కోరాయి. ఈ విషయాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రాధాన్యంగా తీసుకుని, పౌర విమానయాన శాఖతో పాటు సంబంధిత భద్రతా సంస్థలతో సమన్వయం జరిపి, అయ్యప్ప భక్తులకు ప్రత్యేక మినహాయింపు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈరోజు నుంచే దేశవ్యాప్తంగా అమలు
ఈ సడలింపు ఇప్పటి నుంచే అమల్లోకి వస్తుంది. మండల పూజల ప్రారంభం నుంచి మకర విలక్కు ముగిసే జనవరి 20 వరకు ఈ ప్రత్యేక అవకాశం అమలు అవుతుంది. ఈ కాలంలో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు, ఎయిర్‌పోర్టు భద్రతా తనిఖీలు పూర్తిచేసిన తరువాత, తమ ఇరుముడిని నేరుగా విమానం క్యాబిన్‌లో చేతి సామానుగా తీసుకువెళ్లవచ్చు.
భద్రతా సూచనలు తప్పనిసరి
భక్తులందరూ ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలని మంత్రి సూచించారు. ఇరుముడి స్క్రీనింగ్, భద్రతా తనిఖీ, నిర్దిష్ట మార్గదర్శకాల అమలులో ఉంటాయి, వీటిని కచ్చితంగా పాటించాలని ఆయన తెలిపారు. పవిత్రతకు భంగం కలగకుండా, భద్రతను ప్రభావితం చేయకుండా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని భక్తులకు సూచించారు.








