తమ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)లకు పాల్పడుతోందని ఇటీవల అంగీకరించిన తెలంగాణ (Telangana) సీఎం (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)పై మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్(BRS) నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ (R.S. Praveen Kumar) సంచలన ఆరోపణలు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఈరోజు సిట్(SIT) విచారణకు ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశానని వెల్లడించారు. “డార్క్ వెబ్ సాయంతో సీఎంలా ఉన్న రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లు కూడా టాప్ చేస్తున్నాడని నాకు సమాచారం ఉంది” అన్నారు.
ఆయన మరో కీలక విషయాన్ని వెల్లడిస్తూ, గతంలో తన ఫోన్ హ్యాక్ అయినట్టు యాపిల్ సంస్థ (Apple Company) నుంచి సమాచారం అందిందని తెలిపారు. అదే సమయంలో తాను పోలీస్ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ టాపింగ్ వంటి చర్యలకు పాల్పడలేదని స్పష్టంచేశారు. “కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ అక్రమాలకు పాల్పడుతోంది. ప్రైవసీ హక్కులను బహిరంగంగా ఉల్లంఘిస్తోంది” అంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు.








