సంక్రాంతి పండగ అంటే కోడి పందాలకు పెట్టింది పేరు. కొన్ని చోట్ల ఈ పందాలు ప్రశాంతంగా జరిగినా, మరికొన్ని చోట్ల ప్రాణాల మీదకు తెస్తాయి. తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఏలూరు జిల్లా కామవరపుకోటలోని మారుతీనగర్లో కోడి పందాల బరిలో ఓటమి, గెలుపుల వివాదం తీవ్ర హల్‌చల్‌కి దారితీసింది. పందెం ముగిసిన తర్వాత ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒప్పందం కుదరకపోవడంతో కుర్చీలు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
నిర్వాహకుల చర్యలు
వివాదం చెలరేగడంతో నిర్వాహకులు తక్షణమే లైట్లు ఆపి, పందాలను నిలిపివేశారు. ఎటువంటి తీవ్రమైన పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, ఇరు వర్గాల మధ్య సద్దుమణిగేలా చేశారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉందని పోలీసులు తెలిపారు.








