క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా (India-Australia) వన్డే సిరీస్ ఆదివారం (అక్టోబర్ 19) పెర్త్‌లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి మాజీ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పైనే ఉంది, ఎందుకంటే కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత అతను ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే. టీమిండియా పగ్గాలు ఇప్పుడు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) చేతిలో ఉన్నాయి, కాగా ఆసీస్‌కు మిచెల్ మార్ష్ (Mitchell Marsh) నాయకత్వం వహించనున్నాడు.
ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ శర్మకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 30 వన్డేల్లో 53.12 సగటుతో 1,328 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు (990) చేసిన భారత ఆటగాడిగానూ రోహిత్ రికార్డు సృష్టించాడు.
తొలి వన్డే జరిగే పెర్త్ మైదానంలో రోహిత్ రికార్డు మరీ అద్భుతం. కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 122.5 సగటుతో ఏకంగా 245 పరుగులు చేశాడు. ముఖ్యంగా, 2016లో ఆసీస్‌తో జరిగిన వన్డేలో 163 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్స్‌లతో అజేయంగా 171 పరుగులు చేశాడు. వాకా స్టేడియం (WACA Stadium)లో వన్డే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడు రోహితే. ఈ సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.








