తాను టెస్టుల నుంచి రిటైర్ అవుతానంటూ వస్తున్న వార్తలపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. రిటైర్మెంట్ గురించి ఇప్పట్లో ఆలోచన లేదని తేల్చిచెప్పారు. తన బ్యాట్ నుంచి రన్స్ రావట్లేదని, కానీ జట్టును ముందుకు నడిపించేందుకు తనపై నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
“WTC ఫైనల్ చేరేందుకు ఈ మ్యాచ్ మాకు కీలకం కావడంతో నేను స్వయంగా జట్టు నుంచి తప్పుకున్నా. కానీ, నా రిటైర్మెంట్ గురించి ఎవరో బయట కూర్చొని డిసైడ్ చేయడం అసంభవం” అని రోహిత్ స్పష్టం చేశారు. తాను త్వరలోనే ఫామ్ అందుకుంటానని, జట్టుకు మరింత విలువనిచ్చే ప్రదర్శన చేస్తానని హిట్ మ్యాన్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.
భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో రోహిత్ విఫలమవుతూ వస్తున్నారు. హిట్ మ్యాన్ తన బ్యాట్‌కు పనిచెప్పకపోవడంతో క్రికెట్ అభిమానులంతా నిరాశ వ్యక్తం చేస్తూ, రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జాతీయ మీడియా కూడా రోహిత్ రిటైర్మెంట్‌పై పలు వార్తా కథనాలు రాసుకొచ్చింది. దీంతో కెప్టెన్ రోహిత్ ఐదో టెస్టు తరువాత రిటైర్మెంట్ ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ, ఈ వార్తలపై తానే స్వయంగా వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.