రోహిత్ కెప్టెన్సీ మార్పు వెనుక గంభీర్ మాస్టర్ ప్లాన్!

రోహిత్ కెప్టెన్సీ మార్పు వెనుక గంభీర్ మాస్టర్ ప్లాన్!

టీమిండియా (Team India)వన్డే కెప్టెన్సీ నుంచి స్టార్ బ్యాటర్ రోహిత్‌ శర్మ (Rohit Sharma)ను తప్పించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నప్పటికీ, బీసీసీఐ(BCCI) తీసుకున్న ఈ నిర్ణయం వెనుక బలమైన కారణం మరియు దీర్ఘకాలిక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.

భారత క్రికెట్ బోర్డు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)కు వన్డే పగ్గాలు అప్పగించింది. వచ్చే వన్డే ప్రపంచకప్‌ వరకు టీమిండియా కొత్త కెప్టెన్‌తోనే బరిలోకి దిగాలనే పట్టుదలతో మేనేజ్‌మెంట్ ఉంది. రాబోయే రోజుల్లో మూడు ఫార్మాట్ల పగ్గాలను కూడా గిల్‌కే అప్పగించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ కీలక మార్పు వెనుక ఉన్న ప్రధాన కారణం ‘టీమ్ కల్చర్’ దెబ్బతినకూడదనే వ్యూహమేనని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. సారథి పోషించే పాత్ర: ఆటగాడిగా రోహిత్ అద్భుతంగా రాణిస్తాడు. కానీ, నాయకుడిగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో తనదైన ఫిలాసఫీతో జట్టును నడిపించాల్సి ఉంటుంది.

ఒకే కెప్టెన్: రోహిత్ ప్రస్తుతం కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. వన్డే మ్యాచ్‌లు చాలా తక్కువగా ఉండటంతో, భిన్నమైన నాయకత్వాలు ఉంటే టీమ్ కల్చర్ దెబ్బతినే అవకాశం ఉంది. అన్ని ఫార్మాట్లకూ ఒకరే సారథిగా ఉంటే డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

గంభీర్ – అగార్కర్ వ్యూహాత్మక నిర్ణయం
ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, టీమ్‌పై తన పట్టును పెంచుకున్నారు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఎదురైన ఓటమి తర్వాత, గంభీర్ తనదైన కఠిన వ్యూహాలకు పదును పెట్టాడు. గతంలో రోహిత్‌కు ఎక్కువ అవకాశాలు ఇచ్చినప్పటికీ, జట్టును పూర్తిగా తన అధీనంలోకి తీసుకునే క్రమంలోనే ఈ కెప్టెన్సీ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ 35 ఏళ్లు దాటిన నేపథ్యంలో, వారి ఫామ్ గురించి మేనేజ్‌మెంట్‌లో ఆందోళన ఉంది. మరో రెండేళ్లలో వన్డే ప్రపంచకప్ ఉన్నందున, గంభీర్ – అజిత్ అగార్కర్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ ఒక్కసారిగా ఫామ్‌తో ఇబ్బంది పడితే, చివరి నిమిషంలో జట్టులో ఎలాంటి అయోమయ పరిస్థితులు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ఈ మార్పు చేసినట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. శుభ్‌మన్‌ గిల్‌ ఇప్పటికే టెస్టు సారథిగా ఉన్నాడు, టీ20ల్లో సూర్యకు డిప్యూటీగా ఉన్నాడు. వచ్చే టీ20 ప్రపంచకప్ తర్వాత మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ అతడికే దక్కే అవకాశాలు మెండగా ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment