బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కీలకమైన మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాల్గవ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వీరి పేలవమైన ఆట తీరు టీమిండియా అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో వీరి ప్రదర్శన అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ ఇద్దరి సీనియర్లపై నెటిజన్లలో తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.
సోషల్ మీడియా ప్రతిస్పందనలు
“జట్టుకు ఇంకా వీరి అవసరం ఉందా?” హ్యాపీ రిటైర్మెంట్ అంటూ అభిమానులు వీరిపై విమర్శలు గుప్పిస్తున్నారు. టెస్టు క్రికెట్ నుంచి వీరు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టు మేనేజ్‌మెంట్ ఈ విషయంపై పునరాలోచన చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి.
టెస్టు క్రికెట్‌లో వీరి ఫామ్ పునరుద్ధరణ జట్టుకు ఎంత అవసరమో, అభిమానుల నమ్మకం నిలుపుకోవడం కూడా వారికి అంతే కీలకం. నాల్గవ టెస్ట్ చివరి రోజు మ్యాచ్‌లో భారీ అంచనాల నడుమ బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా అందరినీ నిరుత్సాహపరిచింది. క్రీజ్‌లో ఎక్కువసేపు నిలబడేందుకు రోహిత్, కోహ్లీ ప్రయత్నించకపోవడంతోనే మ్యాచ్ చేజారిపోయిందని అభిమానులు ఆగ్రహిస్తున్నారు.