సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా (Team India) వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. బెంగళూరు (Bengaluru)లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (Center of Excellence) మైదానంలో దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-ఏ సారథిగా పంత్ ఆడుతున్నాడు. అయితే, బ్యాటింగ్ చేయకముందే పంత్ ఒక ఆసక్తికర అంశంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాడు.
అందుకు కారణం… అతడు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) జెర్సీ నంబర్ 18 ధరించి మైదానంలోకి రావడమే. పంత్ నిజానికి తన జెర్సీ నంబర్ 17. కోహ్లీ ఇటీవల టెస్టులకు రిటైర్‌మెంట్ ఇచ్చినందున, పొరపాటున 18గా ప్రింట్ అయిందా లేక ఉద్దేశపూర్వకంగా ధరించాడా అనే చర్చ అభిమానులలో మొదలైంది.
సాధారణంగా, స్టార్ ఆటగాళ్లు రిటైర్‌మెంట్ ప్రకటించినప్పుడు, వారి జెర్సీ నంబర్లను కూడా బోర్డులు రిటైర్ చేస్తాయి. ఇప్పటికే సచిన్ టెండూల్కర్ (10), ఎంఎస్ ధోనీ (7) జెర్సీ నంబర్లకు బీసీసీఐ వీడ్కోలు పలికింది. విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకున్నందున, అభిమానులు 18 నంబర్‌ను కూడా రిటైర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కోహ్లీ ఇంకా వన్డేల్లో కొనసాగుతున్నందున బీసీసీఐ(BCCI) ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కోహ్లీ పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాకే బీసీసీఐ ఆలోచన చేసే అవకాశం ఉంది. గతంలో పేసర్ ముకేశ్ కుమార్ (Mukesh Kumar) కూడా 18వ నంబర్ జెర్సీ ధరించడం గమనార్హం.





 



