టీమ్ ఇండియా (Team India) స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. టి20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంటున్న సమయంలోనే ఆయన తండ్రి(Father) ఖచంద్ర సింగ్ (Khachandra Singh) ఇవాళ వేకువజామున కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా లివర్ క్యాన్సర్ (Liver Cancer) నాల్గో దశతో పోరాడుతున్న ఖచంద్ర సింగ్ గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ దుర్వార్త తెలుసుకున్న రింకూ సింగ్ వెంటనే జట్టును వదిలి స్వగ్రామానికి బయలుదేరారు. ఇప్పటికే తండ్రి ఆరోగ్యం విషమించడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం ఉత్తరప్రదేశ్ వెళ్లి ఒకరోజు ఆసుపత్రిలో గడిపిన రింకూ, మళ్లీ జట్టులో చేరిన కొద్దిసేపటికే ఈ విషాదం చోటుచేసుకోవడం మరింత కలచివేసింది. క్రీడా మరియు రాజకీయ వర్గాలు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాయి.
ఇదిలా ఉంటే, రింకూ సింగ్ వివాహం (Rinku Singh Marriage) కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీ ప్రియా సరోజ్ (MP Priya Saroj)తో ప్రేమ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న రింకూ, 2025 జూన్ 8న నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. 2026 జూన్‌లో పెళ్లి జరగాల్సి ఉండగా, కుటుంబ సంప్రదాయాల ప్రకారం ఇంట్లో మరణం సంభవించినప్పుడు ఏడాది పాటు శుభకార్యాలు నిర్వహించరని సమాచారం. ఈ నేపథ్యంలో వారి వివాహం వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా సంభవించిన ఈ విషాదం రింకూ సింగ్ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచేసింది.








