విజయవాడలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఐపీఎల్ వేడుక ఒక యువకుడి ప్రాణాన్ని బలిగొంది. 18 ఏళ్ల తరువాత అభిమాన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఎట్టకేలకు టైటిల్ కైవసం చేసుకోవడంతో విజయవాడలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సంబరాల్లో ఉత్సాహంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న ఓ అభిమాని దురదృష్టవశాత్తూ మరణించాడు.
శేఖర్ (30) అనే యువకుడు తన స్నేహితులు ఉదయ్ కుమార్, శ్రీనాథ్‌లతో కలిసి రాత్రి 12:15 గంటల సమయంలో విజయవాడలో బైక్ ర్యాలీకి బయలుదేరాడు. అత్యుత్సాహంతో నిర్వహించిన ఈ ర్యాలీలో వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ గాయపడగా, శేఖర్‌కు తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటన ఆర్‌సీబీ అభిమానుల మధ్య తీవ్ర విషాదాన్ని నింపింది. క్రీడలపై అభిమానం ఉండటం సహజమైనా, ఆ ఉత్సాహం హద్దులు మీరి ప్రాణాలను పణంగా పెట్టడం బాధాకరం. ఈ సంఘటన యువతకు ర్యాలీలు, వేడుకల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తు చేస్తోంది.
బెంగళూరులో 11 మంది మృతి
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద నిర్వహించిన ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 మందికి పైగా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్సీబీ విజయం ఫ్యాన్స్ ప్రాణాల మీదకు తెచ్చిందని బాధిత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.